కేసీఆర్ ని ఓడించడమే తన లక్ష్యమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న ఆయన ఇటీవల బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు బీజేపీలో ఉంటూ టీఆర్ఎస్ ఓటమికి కృషి చేస్తున్నారు. కాగా.. తాజాగా మీడియా తో మాట్లాడిన ఆయన సీఆర్ తీరుపై, సభలో జరిగిన సస్పెన్షన్ వేటుపై తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు.
శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు ఈటల. స్పీకర్ ను మరమనిషి అన్నందుకే తనను సస్పెండ్ చేశారని.. మరి మోడీ గురించి, బీజేపీ నేతల గురించి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. ఆయనకు ఏం శిక్ష వేయాలన్నారు. ఒక్క సభ్యుడు ఉన్నా కూడా బీఏసీలో పాల్గొనేందుకు ఒకప్పుడు అవకాశం ఇచ్చేవారని గుర్తు చేశారు.
బీఏసీ అంశం గురించి రఘునందన్ రావు అడిగినా స్పీకర్ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆయన్ను ఓడించి తీరతానని సవాల్ చేశారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. తప్పు చేసినవాళ్లే దొరలెక్క ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసేవాళ్లకు శిక్షలు వేస్తున్నారని ఆరోపించారు.
గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే తాను భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్ కు ఎలా భయపడతానని అన్నారు రాజేందర్. తనకు తన కుటుంబసభ్యులకు ఏమైనా అయితే అది కేసీఆర్ దే బాధ్యత అని చెప్పారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించలేదని మండిపడ్డారు. రుణమాపీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈటల రాజేందర్.