గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh)తో బీజేపీ ఎన్నికల మేనేజ్మేంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాజాసింగ్ సస్పెన్షన్ అంశంతో పాటు.. నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న తీరుపై చర్చించారు. కాగా ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, కార్పొరేటర్‌పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్న విషయాన్ని రాజాసింగ్ ఈటల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో ఈటల రాజేందర్ (Etala Rajender) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులపై కక్షపురితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో ఎలా అయినా గెలవాలని తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీజేపీ (BJP) నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతానని ఈటల చెప్పారు. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందన్నారు. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఈటల అన్నారు.తాను బీఆర్ఎస్ లోకి వెళ్తాననే వార్తలను రాజాసింగ్ కొట్టి పారేశారు. తన జీవితంలో ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను మంత్రులు తలసాని శ్రీనివాస్ (Thalasani Srinivas) యాదవ్, హరీశ్ రావు తదితరులందరినీ కలుస్తానని చెప్పారు. కానీ పార్టీ మారేది లేదన్నారు.