»Cm Kcrs Politics With Illegally Looted Money Union Minister Kishan Reddy
Kishan Reddy : అక్రమంగా దోచుకున్న డబ్బుతో సీఎం కేసీఆర్ రాజకీయం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు ప్రగతి భవన్, ఫాంహౌస్ కూడా దాటడంలేదని అన్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) క్లాసిక్ గార్డెన్లో హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాల బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో దోపిడీ చేసిన డబ్బులతో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడం కోసమే సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆయన అన్నారు.అక్రమంగా దోచుకున్న డబ్బులను బీఆర్ఎస్ (BRS)పేరుతో దేశమంతటా రాజకీయ నాయకులకు పంచబోతున్నారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని మోదీ (PM MODI) వస్తే మర్యాదపూర్వకంగా కలిసే సంస్కారం కూడా లేదని కేసీఆర్పై గరం అయ్యారు.
కనీసం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వచ్చే తీరిక ఆయనకు లేదని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, అందరికీ దళిత బంధు అమలు చేస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ పరిపాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ (BJP) కార్యకర్తపై ఉందన్నారు. ఈనెల 30 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా జరిగే ‘మహాజన్ సంపర్క్ అభియాన్’(Sampark Campaign)’ కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయడంతో పాటు వారిని సంఘటితం చేయాలని సూచించారు.