గణేష్ నిమజ్జనం విషయంలో… తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు సరిగా లేదంటూ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో… ఈ రోజు ట్యాంక్ బండ్ పై బైక్ ర్యాలీ చేపట్టారు. కాగా… వారి బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో…. వారి మధ్య వివాదం నెలకొంది.
ట్యాంక్‌బండ్‌పై బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు నిన్న చెప్పిన విధంగానే.. ఇవాళ భారీ ర్యాలీతో అక్కడకు చేరుకున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుగించారు. దాంతో పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపయ్య విగ్రహాలనే నిమజ్జనం చేయాలంటూ గతంలో ప్రభుత్వం సూచించింది. అయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని భాగ్యనగర్ గణేశ్ ఉత్సక కమిటీ పట్టుబట్టింది. ఈ మేరకు నిన్న విలేకర్ల సమావేశం నిర్వహించి తొమ్మిదో తేదీన హుస్సేన్ సాగర్‌లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తామని కమిటీ తేల్చి చెప్పింది. పోలీసులు, ప్రభుత్వం తమకు సహకరించాలని.. ఎలాంటి ఉద్రిక్తత జరిగినా అందుకు ప్రభుత్వమే కారణమంటూ కమిటీ అధ్యక్షుడు చెప్పారు.
మరోవైపు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనివ్వకపోతే.. ప్రగతి భవన్లో చేస్తామంటూ హెచ్చరించారు. ఈ వివాదాల నడుమ స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.. వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, యథావిధిగానే జరుగుతాయని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.