»Bsp Election Manifesto Released Rs Praveen Kumar Announced 10 Schemes
BSP: బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..10 పథకాలు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ ఎన్నికల వేళ బీఎస్పీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 10 అద్భుతమైన పథకాలతో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
తెలంగాణ (Telangana)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేయగా తాజాగా బీఎస్పీ పార్టీ కూడా విడుదల చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్ని ఆకర్షించేందుకు హోరాహోరీ హామీలను, పథకాలను రూపొందించి ప్రకటించారు. తాజాగా బీఎస్పీ మేనిఫెస్టో (BSP Manifesto)ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 10 పథకాలతో (10 Schemes) తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బీఎస్పీ తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.
10 పథకాలతో కూడిన బీఎస్పీ మేనిఫెస్టో ఇదే: 1.కాన్సీ యువ సర్కార్ 2.బహుజన రైతు ధీమా 3.పూలే విద్యా దీవెన 4. బ్లూ జాబ్ కార్డు 5.దొడ్డి కొమరయ్య భూమి హక్కు 6.నూరేళ్ల ఆరోగ్య ధీమా 7.చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి 8.వలస కార్మికులు సంక్షేమ నిధి 9.భీమ్ రక్షణ కేంద్రం 10.షేక్ బందగీ గృహ భరోసా
కాన్షి యువ సర్కార్ స్కీమ్ కింద యువతకు 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులోనే మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులను నియమించనున్నారు. బహుజన రైతు ధీమా స్కీమ్ ద్వారా ప్రతి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడం, విత్తనం నుంచి విక్రయం వరకూ ప్రభుత్వ రాయితీ ఇవ్వడం, ధరణి పోర్టల్‌ను రద్దు చేసే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
దొడ్డి కొమురయ్య భూమి హక్కు స్కీమ్‌లో భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 1ఎకరం భూమిని ఇవ్వనున్నారు. ఆ భూమి పట్టా మహిళలపేరుపై అందజేయనున్నట్లు తెలిపారు. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి స్కీమ్ కింద మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ శిక్షణను ఇవ్వనున్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టనున్నారు. మహిళ సంఘాలకు ఏటా ఒక లక్ష రూపాయలు ఇవ్వనున్నారు.
బీమ్ రక్ష కేంద్రాల ద్వారా వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం అందించనున్నారు. రక్ష కేంద్రాల ద్వారా వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటును అందించనున్నట్లు తెలిపారు. పూలే విద్యా దీవెన స్కీమ్ కింద మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశి విద్యను అందించడమే కాకుండా కోడింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
బ్లూ జాబ్ కార్డు పథకం కింద పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీని ప్రకటించారు. అలాగే కూలీ రూ.350 ఇవ్వడమే కాకుండా కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమాను అందించనున్నట్లు తెలిపారు. నూరేళ్ళ ఆరోగ్య ధీమా స్కీమ్ కింద ప్రతి ఫ్యామిలీకి 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజ్ అందించనున్నట్లు తెలిపారు. ఏటా 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్‌ను రూపొందిస్తామని ప్రకటించారు. వలస కార్మికుల సంక్షేమ నిధి పథకం కింద 5,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. షేక్ బందగీ గృహ బరోసా పథకం కింద ఇళ్లు లేని వారికి 550 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల సాయాన్ని అందిస్తామన్నారు. ఇంటి పునర్మిరానికి 1.5 లక్షల సహాయాన్ని బీఎస్పీ ప్రకటించింది.