»All Passports Of Kcr Family Should Be Seized Immediately Bandi Sanjay
Bandi Sanjay: కేసీఆర్ ఫ్యామిలీలో అందరి పాస్పోర్ట్స్ సీజ్ చేయాలి: బండి సంజయ్
కేసీఆర్ ఫ్యామిలీలో అందరి పాస్‌పోర్టులను సీజ్ చేయాలని, లేకుంటే దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఆయన కుటుంబం సహా ఆ పార్టీ నాయకుల పాస్‌పోర్టులను జప్తు చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. వారి పాస్‌పోర్టులు సీజ్ చేయకుంటే వారు దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మినహా ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
ప్రజల సొమ్మును దోచుకుని తిన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని త్వరగా బయటపెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకంటే ముందే వాళ్ల పాస్ పోర్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీజ్ చేయాలని కోరారు. లేదంటే విదేశాలకు పారిపోయే అకాశముందని అన్నారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆయన ఆరోగ్యం కుదటపడే వరకు వేచి చూసి ఆ తర్వాత అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.