గిరిజన సంక్షేమం (Tribal welfare) కోసం ప్రభుత్వలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో గిరిజనుల (Tribals) గోడు వినే నాధుడే లేడు. కేవలం ఎన్నికల సమయంలో కనిపించే నాయకులే తప్ప, వారి కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచే నాయకులు లేరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగున సౌకర్యాల(facilities)తో, ఇబ్బందులతో పడరాని పాట్లు పడుతున్న గిరిజనులు ఆవేదనలో ఉన్నారు.
ములుగు జిల్లా (Mulugu District)ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గర్భిణీ మహిళ (Pregnant woman)లు ఆసుపత్రులకు వెళ్లడానికి ప్రసవవేదన కు మించిన బాధలను అనుభవిస్తున్నారు. గిరిజన గూడేలకు సమీపంలో ఆసుపత్రులు లేకపోవడం, కనీసం వాహనాలు కూడా వెళ్లేందుకు రోడ్లు లేకపోవడం వంటి సమస్యలతో డెలివరీ నొప్పులతో బాధపడుతున్న మహిళలను డోలీలుతో ఆసుపత్రి (Hospital) కి తరలించాల్సిన పరిస్థితి నేటికీ కనిపిస్తుంది.
ఏటూరునాగారం (Eturunagaram) మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి.ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రహదారి (Road) సరిగా లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్(Ambulance)లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.