ఇజ్రాయెల్ (Israel), పాలస్తీనా (Palestina) మధ్య యుద్ధం (War) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు వదిలారు. ఈ రెండు ప్రాంతాల్లో ఎటుచూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. తాజాగా హమాస్ తీవ్రవాదులు చేసిన అతి దారుణమైన పని అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇజ్రాయెల్ లోని యోసి లాండౌ (Yossi Landau) అనే వ్యక్తి జకా అనే సంస్థలో వాలంటీర్‌గా ఉన్నాడు. గత 33 ఏళ్లుగా ఆ వ్యక్తి మృతదేహాలను సేకరించే పనిని చేస్తున్నాడు. ప్రస్తుతం యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తుండగా భయానక దృశ్యాలు ఆ వ్యక్తిని కంటతడి పెట్టేలా చేశాయి.
దాదాపు 1200 భయానక మృతదేహాలను చూసి తన గుండె బద్దలైందని యోసి లాండౌ కన్నీటిపర్యంతమయ్యారు. హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ గర్భిణి మృతదేహాన్ని చూసి వణుకు పుట్టిందన్నారు. రోడ్డుపైన గర్భిణీ భయానక స్థితిలో కనిపించిందని, ఆ తల్లి పొట్టను చీల్చిమరీ ఆమె కడుపులోని బిడ్డను చంపారని, ఆ దృశ్యాలను చూసి తన ఒళ్లు గగుర్పొడిచిందని అంతర్జాతీయ మీడియాకు విన్నవించాడు.
హమాస్ మిలిటెంట్లు తమ ప్రాంతంలోకి చొరబడ్డారని, మునుపెన్నడూ చూడని హింసను చూశానని ఆ వ్యక్తి తెలిపాడు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాల మధ్య కాల్పులు భీకరంగా జరిగాయని, వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసి గుండె తరుక్కుపోయిందన్నారు. గర్భిణిని దారుణంగా చంపడానికి వారికి మనసెలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ తల్లి బొడ్డుతాడు కూడా తెగని స్థితిలో ఉందని, బిడ్డను బయటకు తీసి చంపడం మరీ దారుణమన్నాడు. అలాగే 20 మంది పిల్లలతో సహా అనేక మంది ప్రజల చేతులను వెనుకకు కట్టి తుపాకులతో కాల్చి చంపారని, కొందరు మహిళలను అత్యాచారం చేసి కిరాతకంగా చంపినట్లు ఆ వాలంటీర్ యోసి లాండౌ తెలిపాడు. హమాస్ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి వరకూ గాజాపై 6 వేల బాంబులతో దాడి చేసిన సంగతి తెలిసిందే.