World Book Of Records: పుట్టిన 72 రోజులకే ప్రపంచ రికార్డ్..!
ఓ పాప పుట్టిన 72 రోజుల్లోనే 31 ధ్రువపత్రాలను పొంది వరల్డ్ రికార్డును సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ చిన్నారి ఇప్పటి వరకూ ఎవరి పేరుపై లేనన్ని సర్టిఫికెట్లతో రికార్డును నెలకొల్పింది.
ఓ చిన్నారి పుట్టిన 72 రోజులకే ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆ చిన్నారి పేరుపై ఏకంగా 33 ప్రభుత్వ ధ్రువపత్రాలు ఉండటంతో వరల్డ్ రికార్డు సాధించింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh)లోని ఛింద్వాడా జిల్లాకు చెందిన కేసరినందన్ సూర్యవంశీ, ప్రియాంక దంపతులకు జులై 8న ఓ పాప జన్మించింది. ఆ పాపకు శరణ్య (Sharanya) అనే పేరు పెట్టారు. పాప పుట్టుక ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్న దంపతులు గతంలో 28 గుర్తింపు పత్రాలతో ఓ చిన్నారి రికార్డు నెలకొల్పినట్లు తెలుసుకున్నారు.
దీంతో తాము కూడా తమ కూతురి పేరును ప్రపంచ రికార్డుల్లో చేర్చాలనుకుని పోటీకి దిగారు. అందుకోసం తమ కూతురిపై వీలనన్ని ఎక్కువ డాక్యుమెంట్లను తీసుకురావాలనుకున్నారు. శరణ్య పుట్టిన 72 రోజుల్లోనే 31 ధ్రువపత్రాలను సాధించారు. దీంతో అత్యధిక ధ్రువపత్రాలు కలిగిన పాపగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book Of Records)లో శరణ్యకు చోటు లభించింది.
తల్లిదండ్రులు కేసరి నందన్, ప్రియాంక ఇద్దరూ పోస్టల్ శాఖలో ఉద్యోగులుగా (Postal Employees) ఉన్నారు. అంతేకాకుండా శరణ్య తాతయ్య కూడా తపాలాశాఖ ఉద్యోగే కావడంతో శరణ్య పేరుపై 72 రోజుల్లో 31 గుర్తింపు పత్రాలు సాధించి రికార్డు సాధించారు.
శరణ్యకు ఉండే ధ్రువపత్రాలు ఇవే:
పాస్‌పోర్ట్, ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, ఇమ్యునైజేషన్ కార్డ్, ‘లాడ్లీ లక్ష్మి’ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, జాతీయ ఆరోగ్య కార్డ్, ‘సుకన్య సమృద్ధి’ ఖాతా, ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ పత్ర’, ‘రాష్ట్రీయ పొదుపు పత్రాలు’, ‘కిసాన్ వికాస్ పత్ర’, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, పీఎన్బీ ఎటీఎం కార్డ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా, బ్యాంకు ఖాతాలే కాకుండా మరికొన్ని పత్రాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.