Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ విరుచుకుపడగా.. బీజేపీ బీఆర్ఎస్, ఎంఐఎం లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. మజ్లిస్ పార్టీ ఓల్డ్ సిటీకే పరిమితం అని.. రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు పోటీ చేయడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు.
మిగతా రాష్ట్రాల్లో కాదు రాష్ట్రంలోని అన్నీ చోట్ల పోటీ చేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా ఎందుకు మార్చడం లేదని ఫైరయ్యారు. ఆ ఆరు, ఏడు సీట్లకే పరిమితం ఎందుకు అవుతున్నారని.. ఇదీ బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం కాదా అని అడిగారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అందరికీ తెలుసు అని చెప్పారు. ఇప్పుడు రుజువు అయ్యిందని వివరించారు. రజాకార్ల దారుణాలతో తెరకెక్కిన సినిమా రజకార్పై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ మజ్లిస్ చేతిలో కీలు బొమ్మ అన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందన్నారు.
గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ సపోర్ట్ చేసింది. ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ విమర్శిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించాలి. కాంగ్రెస్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులతో జాబితా రిలీజ్ చేసింది. అందులో మైనంపల్లి పార్టీ వీడటంతో 104 మంది క్యాండెట్స్ బరిలో ఉన్నారు.