పొట్టి ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైలే వేరు. తనదైన బ్యాటింగ్ తో 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్ లో అతడు చేసిన ఇన్నింగ్స్ అసాధారణమైన ప్రదర్శనే. సూర్య చెలరేగి ఆడుతుంటే క్రీడాభిమానులు పండుగ చేసుకున్నారు. అందులో సిక్సర్లతో చెలరేగిపోయి అత్యధిక పరుగులు సాధించిన సూర్య ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2022 సంవత్సరానికి గాను టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా సూర్యను ఐసీసీ ఎంపిక చేసింది.
గతేడాది సూర్య అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 2022లో సూర్య పొట్టి ఫార్మాట్ లో మొత్తం 31 మ్యాచ్ లు ఆడి 45.56 సగటుతో 1,164 పరుగులు సాధించాడు. గతేడాది టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్య గుర్తింపు పొందాడు. ఈ ఫార్మాట్ లో రెండు సెంచరీలు గతేడాదే నమోదు చేయడం విశేషం. నిరుడు 9 అర్ధ శతకాలు బాదాడు. ఏకంగా 68 సిక్సర్లు బాది సిక్సర్ల వీరుడిగా సూర్య రికార్డు నెలకొల్పాడు. ఇక టీ20 ప్రపంచకప్ లో సూర్య దుమ్ము రేపాడు. ఆరు ఇన్నింగ్స్ ఆడి మూడు అర్ధ శతకాలు బాది తిరుగులేని ఆటగాడిగా నిరూపించుకున్నాడు. వినూత్న షాట్లతో అభిమానులను అలరిస్తూనే క్రికెట్ లో చెరగని ముద్ర వేస్తున్న సూర్య టీ20 ఫార్మాట్ బ్యాటింగ్ ర్యాకింగ్స్ లోనూ కింగ్ గా ఉన్నాడు.