టీ20 లో భాగంగా వచ్చే ఆదివారం ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య జింఖానా స్టేడియంలో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ మ్యాచ్ కోసం టికెట్ల కోసం వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరగడం గమనార్హం.
ఈ క్రమంలోనే అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆ లాఠీ చార్జి సందర్భంగా ఓ మహిళ మృతి చెందినట్లు, మరో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానా మైదానంలో మ్యాచ్ టికెట్లు ఆఫ్ లైన్ లో విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిన్న రాత్రి ప్రకటించింది. దీంతో, ఈరోజు తెల్లవారుజామున నుంచే వేలాది మంది అభిమానులు స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే జింఖానా గేటు దగ్గర నుంచి ప్యారడైజ్ సిగ్నల్ వరకు కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు.
అయితే, ఉదయం 11 దాటినప్పటికీ టికెట్ కౌంటర్లు తెరవకపోవడంతో కొంతమంది యువకులు అసహనం వ్యక్తం చేశారు. దాంతోపాటు, కేవలం 3000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రచారం జరగడంతో అభిమాననులంతా ఒక్కసారిగా కౌంటర్లు వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. కొంతమంది గేట్లు తోసుకొని, గోడలు దూకి గ్రౌండ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దాదాపు 30 వేల మంది స్టేడియం దగ్గర ఉండడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు.
ఈ సందర్భంగా పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పడంతో అభిమానులను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్లను మూసివేసి టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు.