ఇటీవల వివాహం చేసుకున్న పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో వివాహంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయబ్ పెళ్లిపై సానియా టీమ్, కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
Shoaib Malik: పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. షోయబ్ 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరు విడిపోయినట్లు వార్తలు వస్తున్నా అవి ఊహాగానాలే అనుకున్నారు. తాజాగా షోయబ్ మళ్లీ వివాహం చేసుకోవడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా షోయబ్ పెళ్లిపై సానియా టీమ్, కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
వ్యక్తిగత వివరాలను సానియా ఎప్పుడూ గోప్యంగానే ఉంచుకుంది. పబ్లిక్ లైఫ్‌కు దూరంగానే ఉంటుంది. ఇప్పుడు షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. షోయబ్, సానియా కొద్ది నెలల కిందటే విడాకులు తీసుకున్నారు. మరో వివాహం చేసుకున్న షోయబ్ కొత్త ప్రయాణం బాగుండాలని సానియా కోరుకుంటుందని.. ఆమె తరపున కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు.
సానియా, షోయబ్ విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియదు. మాలిక్ వివాహేతర సంబంధాలే దీనికి కారణమని పాక్ మీడియా తెలుపుతోంది. అయితే వీరిద్దరి విడాకులు కూడా ఇరు కుటుంబాలకు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. మాలిక్ మూడో వివాహం చేసుకోవడం అతని కుటుంబానికి కూడా నచ్చనట్లు సమాచారం. షోయబ్ కుటుంబం నుంచి ఎవరూ కూడా పెళ్లికి హాజరుకాలేదు. ఇప్పటికే విడాకులు తీసుకున్న సనా జావెద్‌ను మాలిక్ వివాహం చేసుకోవడం, సానియాతో విడాకులు తీసుకోవడం వాళ్లకి ఇష్టం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.