Asian games 2023: ఒకప్పుడు కూలీ..ఇప్పుడు ఆసియా పతక విజేత
బాల్యం నుంచే ఎన్నో కష్టాలు.. కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించి.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని ఆసియా 2023 క్రీడల్లో పతకం సాధించాడు రాంబాబు. అంతేకాదు తన లాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఉహించలేరు. ఎందుకంటే నిరుపేద కుటుంబంలో పుట్టి.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లు మనలో చాలామంది ఉన్నారు. ఇలా నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి..ఈరోజు ఆసియా క్రీడల్లో పతకం సాధించి అందరినీ హౌరా అనిపించాడు. అతనే ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాంబాబు. వారణాసిలో జన్మించిన రాంబాబు(rambabu)కు చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ అంటే మక్కువ. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల తన ఇష్టాలకు దూరంగా ఉండాల్సివచ్చింది. ఎందుకంటే కష్టపడితినే ఇల్లు గడిచే పరిస్థితి. ఒకపూట తింటే ఇంకో పూట గడవని పరిస్థితి. ఇలాంటి ఎన్నో కష్టాలను రాంబాబు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్నాడు. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన రాంబాబుకు రోజురోజుకి పెరిగేది. వీటితో పాటు కుటుంబ సమస్యలు కూడా పెరిగాయి.
దీంతో తనకు ఇష్టమైన మారథాన్ వదిలి..కొంచెం ఈజీగా ఉండే రేస్వాక్లోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం కూలీగా పనిచేస్తూ..ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కేవలం కూలీగా మాత్రమే కాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేయడంతో పాటు ఓ హోటల్లో సర్వర్‌గా కూడా పనిచేశాడు. ఇవన్నీ చేస్తూ ప్రాక్టీస్‌కి కొంత సమయం కేటాయించుకున్నాడు. ఇలా ఎన్నో ఏళ్లు కష్టాల నదిని ఈది..ఈ రోజు ఆసియా క్రీడల్లో(asian games 2023) 35 కిలీమీటర్ల మిక్సిడ్ రేస్‌లో కాంస్యం సాధించాడు రాంబాబు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే ఎన్ని విజయాలైన సాధించవచ్చని తెలుపుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు.