Hyper Aadi Reaction : జనసేన కార్యకర్తల తీరుపై హైపర్ ఆది ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల టీడీపీ, జనసేనలు కలిసి సంయుక్తంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ జాబితాలో జన సేనకు కేవలం 24 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో చాలా మంది జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని, పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు. పార్టీ జెండాను కింద పడేసి తొక్కుతూ ఉన్నారు. ఇలాంటి చర్యలను హైపర్ ఆది ఖండించారు.
ఈ విషయంపై స్పందిస్తూ హైపర్ ఆది ఓ వీడియోని విడుదల చేశారు. దాన్ని నాగబాబు తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తనని నమ్ముకున్న ప్రజలను మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌ది కాదని అన్నారు. పెట్టిన పార్టీ కోసం కార్యకర్తలే ఇంతలా ఆలోచిస్తుంటే ఆయన ఎంతగా ఆలోచిస్తారో ఒక్కసారి ఊహించుకోవాలని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆయన ఎంత మదన పడి ఉంటారో ఆలోచించాలని అన్నారు.
ఎలాంటి అవినీతికీ తావు లేకుండా పది సంవత్సరాలుగా పార్టీని సొంత నిధులతో పవన్ నడుపుతున్నారని హైపర్ ఆది(Hyper Aadi) కొనియాడారు. 2019 ఎన్నికల్లో కనీసం పవన్ కళ్యాణ్‌ని గెలిపించుకోలేని వారికి ఇప్పుడు 24 సీట్లపై ప్రశ్నించే హక్కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బులు సైతం తీసి కౌలు రైతుల సమస్యలను తీర్చిన పవన్ కల్యాణ్ గురించి ఈ రోజు విమర్శలు చేస్తున్నారని ఆది ఆవేదన చెందారు. ఈ విధంగా పవన్ కల్యాణ్ ఎన్నో సమస్యలను పరిష్కరించారని అన్నారు.