రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్‌తో కలిసి రావడం లేదట. దీంతో ఇంచార్జీ ఠాక్రే రంగంలోకి దిగారు. ఈ రోజు వీహెచ్, దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు. పాదయాత్రలో పాల్గొనాలని నేతలకు ఠాక్రే సూచించారని తెలిసింది. తర్వాత మీడియా ముందుకు వచ్చిన వీహెచ్.. రేవంత్ పాదయాత్రలో రెండురోజులు పాల్గొంటానని తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని వీహెచ్ అన్నారు. నేతలు అంతా జనం మధ్య ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ములుగు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సీతక్క బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. మేడారం వన దేవతలు సమ్మక్క సారాలమ్మలకు రేవంత్ ప్రత్యేక పూజలు చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన వాగ్ధానాల అమలులో జాప్యం వంటి అంశాలను రేవంత్ రెడ్డి తన యాత్రలో ప్రశ్నిస్తారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో సంక్షోభం నెలకొందని.. రైతులకు కనీస మద్దతు ధర లేదని, రుణమాఫీ జరగడం లేదని చెప్పే అవకాశం ఉంది. 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టారని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం పక్కా అని పేర్కొన్నాయి.