తనకు కాబోయేవాడికి మైక్రోసాప్ట్ లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని ఓ యువతి నెట్టంట పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉద్యోగులపైనే కాదు.. వారిపై ఆధారపడ్డ వారినీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటిదే ఓ వ్యవహారం తాజాగా నెట్టింట వైరల్గా మారింది.
సలహా కోరుతూ ఓ యువతి అడిగిన ప్రశ్న ఆన్లైన్లో చర్చకు దారితీసింది.‘కుటుంబ సభ్యులు మా ఇద్దరికీ వివాహం కుదిర్చారు. ఫిబ్రవరిలోనే ముహూర్తం నిర్ణయించారు. అంతలోనే నన్ను పెళ్లిచేసుకోబోయేవాడిని ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ ఉద్యోగంలోంచి తొలగించింది. నా కుటుంబానికీ ఈ విషయం తెలుసు. ఇప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోవాలా? వద్దా? తెలియడం లేదు. అతన్ని పెళ్లాడొచ్చా? అతని వేతనం రూ.2.5 లక్షలుగా ఉండేది’ అని ఓ గుర్తుతెలియని యువతి ఓ సోషల్ యాప్ వేదికగా పోస్టు పెట్టారు.
ఇది కాస్త ఆన్లైన్లో వైరల్గా మారింది. యువతి పోస్టుపై భిన్న స్పందనలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన సంబంధాలు వ్యాపార లావాదేవీల్లా మారిన నేపథ్యంలో.. దీన్ని అలాగే పరిగణించాలని కొందరు స్పందించారు. అతనికి నీకంటే మంచి వ్యక్తి దొరుకుతారని మరికొందరు కామెంట్లలో చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జనవరిలో మైక్రోసాఫ్ట్ సంస్థ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.