టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం పోలీసుల అనుమతులు కోరగా, నిరాకరించారు. పోలీసులు అనుమతులు నిరాకరించినప్పటికీ, సమస్యలపై ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ధర్నాకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మద్ధతు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లను ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ధర్నాచౌక్ వద్ద మద్ధతు తెలిపేందుకు రేవంత్ రెడ్డి వస్తారనే సమాచారం ఉండటంతో ఆయన్ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
దీంతో ఆయన ఇంటివద్ద మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ధర్నాచౌక్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ధర్నాలో పాల్గొనేందుకు వచ్చేవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గ్రామ సర్పంచుల నిధుల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం న్యాయం కాదని పలువురు సర్పంచులు వాపోతున్నారు. చాలా కాలంగా నిధుల సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం దృష్టికి ఎన్నిమార్లు ఈ విషయాన్ని తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.