మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని వార్తలు వేగం పుంజుకున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో పొంగులేటి పార్టీలోంచి బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉంది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభను కూడా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొంగులేటి కమలం తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే.. ఇప్పటి వరకు పొంగులేటి మాత్రం తాను బీజేపీలో చేరుతానని ఎక్కడా చెప్పలేదు. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల అనంతరం పార్టీ పెద్దలను కలిసిన తర్వాత చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ, నిజంగానే జిల్లాలో ఏమాత్రం బలం లేని ఆ పార్టీలోకి వెళ్తారా? లేదా మరో పార్టీలో చేరాలని భావిస్తున్నారా? ఈ విషయాల్లో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాలను చూస్తే, ఆయన కమలం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. జిల్లాలో పార్టీకి బలం లేకపోవచ్చు. కానీ పొంగులేటి తన సొంత బలంపై ధీమాగా ఉన్నారు. తన ఆర్థిక, ప్రజాబలంతో జిల్లాలో అగ్రనేతల జాబితాలో మరింత ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. పొంగులేటి బీజేపీలోకి వెళ్లడానికి గల కారణాలు ఏంటి?
సొంతబలంపైనే ధీమా..
అన్నింటికంటే ముఖ్యంగా 2014లో సొంతంగా ఎంపీగా గెలిచిన తనకు తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ, టికెట్ ఇచ్చిన వారికి అండగా నిలబడినప్పటికీ ఆ తర్వాత పదవుల్లో తనను పరిగణలోకి తీసుకోలేదనేది పొంగులేటి ఆవేదనగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరి టిక్కెట్ వారికి దాదాపు ఖరారు అయింది. ఒకవేళ పొంగులేటికి ఏదో ఒక స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ, తన వర్గీయులకు టిక్కెట్ తెచ్చుకునే పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో పొంగులేటి కంటే సీనియర్లు అయినా నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావు ఈ రేసులో ముందుంటారు. తుమ్మల వంటి సీనియర్ నేతనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే అర్థం బీఆర్ఎస్ లో పొంగులేటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తనకు, తన వర్గీయులకు ఉమ్మడి జిల్లాల్లో టిక్కెట్లు ఇప్పించుకునే పరిస్థితి లేదని అర్థం చేసుకొనే.. బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. బీజేపీలో చేరితో తనతో పాటు తన వారికి టిక్కెట్ ఇప్పించుకోవచ్చునని భావిస్తున్నారట పొంగులేటి. పార్టీ కంటే తన బలం పైనే ఆయన ధీమాగా ఉన్నారట.
ఏ గట్టుకు చేరుతాడో?
పార్టీ పరంగా చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ఆశాజనకంగా లేదని, రెండో స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసేందుకు పొంగులేటి ఆసక్తిగా ఉన్నారని రాజకీయ నిపుణుల వాదన. బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పరుగు పెడుతోంది. అందుకే పొంగులేటి కమలం వైపు మొగ్గు చూపి ఉంటారని అంటున్నారు. నల్గొండ, ఖమ్మం వంటి చోట్ల బీజేపీకి లీడర్, కేడర్ కొరత ఉంది. అందుకే బీజేపీ ఉమ్మడి నల్గొండలో రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నాయకుడిని చేర్చుకుంది. ఇప్పుడు ఖమ్మంలోను పొంగులేటి వంటి బలమైన నేతను చేర్చుకోవడం ద్వారా సాధ్యమైనన్ని ఓట్లు, సీట్లు సాధించవచ్చునని బీజేపీ భావిస్తోంది. మరోవైపు పొంగులేటి కూడా జిల్లా విషయం వరకు వస్తే తన బలంతోనే తాను, తన వర్గం వారిని గెలిపించుకోవడం ద్వారా పార్టీలోను పట్టు సాధించే ప్రయత్నాలు చేయవచ్చంటున్నారు పలువురు. పొంగులేటి బీజేపీ వైపు చూడటం వెనుక జగన్ కూడా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరి, పొంగులేటి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి, బీజేపీలోనే చేరుతారా? కాంగ్రెస్ను అనుగ్రహిస్తారా? లేక జగన్ సోదరి షర్మిల పార్టీ వైయస్సార్ తెలంగాణ పార్టీని ఎంచుకుంటారా అనే విషయం తేలాలంటే వేచి చూడాల్సిందే.