NZB: రాజ్యసభ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డిని కమ్మర్ పల్లి మండలంలోని పలువురు సర్పంచులు ఆదివారం కలిశారు. HYDలోని ఆయన నివాసంలో ఎంపీ సురేష్ రెడ్డిని హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, చౌట్ పల్లి సర్పంచ్ మహబూబ్ కలిసి గ్రామాల్లో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన ఎంపీ సురేష్ రూ.16 లక్షల నిధులను మంజూరు చేశారు.
CTR: కార్వేటినగరం(M) అన్నూరు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చాకలివానిగుంట గిరిజన కాలనీకి చెందిన ఓ వ్యక్తి భార్య బిడ్డలతో కలిసి స్కూటర్‌పై పళ్లిపట్టు బయలుదేరాడు. KM పురానికి చెందిన మరో వ్యక్తి బైకుతో వీరిని ఢీకొట్టాడు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: పిఠాపురం ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ (PADA) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తామని, ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
MBNR: పట్టణ మేయర్ జి. మమతను బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి తొలి మేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా కొనియాడారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నంద్యాలలో 41.59 డిగ్రీలు, పార్వతీపురం మన్యంలో 41, తిరుపతిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ క్రమంలో 12 రాష్ట్రాలకు IMD హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.
ATP: రాయదుర్గం పట్టణంలోని స్థానిక వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పోరాళ్ల శిల్ప పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే కాల్వ పేర్కొన్నారు.
BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మహిళా సోదరీమణులకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి వంటి ఎందరో మహిళలు తమ హక్కుల కోసం అసువులు బాసారని పేర్కొన్నారు.
NLG: పెంచిన వంటలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ అన్నారు. ఆదివారం నకిరేకల్ లో పెంచిన ధరలను నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం మోపుతుందని మండిపడ్డారు.
SDPT: రామక్కపేటలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ వేడుకలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
NGKL: కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పట్టణంలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం ఆయన పర్యటించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
NRPT: కోస్గి మున్సిపాలిటీలో 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ వేగంగా సాగుతోంది. ఆదివారం 10వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ నాగులపల్లి నరేందర్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పార్కుల వద్ద పేరుకుపోయిన చెత్తను, మురికిని స్వయంగా సిబ్బందితో కలిసి తొలగించారు. పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
MNCL: 14 ఏళ్లు నిండిన బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందు అన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొమిల్లా ప్రాంతంలో శనివారం పూజ చేసుకుంటున్న హిందువుల బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
సత్యసాయి: హిందూపురం ఏఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సృష్టికి మూలం స్త్రీ అని పేర్కొన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు స్త్రీలకు ఎంతో ప్రత్యేక స్థానం ఇచ్చాయని తెలిపారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని కొనియాడారు.
BHNG: కృష్ణా నీళ్లు సప్లై చేసే మెయిన్ పైపు పగిలి వారం రోజులు అవుతున్నా గ్రామపంచాయతీ సిబ్బంది పాలకవర్గం పట్టించుకోవడం లేదంటూ గ్రామపంచాయతీ ముందు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల ప్రతాప్ ఆదివారం ధర్నా చేశాడు. నారాయణపురం మండలం, లింగవారిగూడెం గ్రామానికి వారం రోజులు అవుతున్నా పట్టించుకోకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు.