AP: శ్రీకాకుళం జిల్లాకేంద్రంలో డయేరియా కలకలం రేపుతోంది. 24 గంటల్లోనే 19 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ముఖ్యంగా కాకి వీధి, దమ్మల వీధి, గుడి వీధి, మంగువారి తోట తదితర ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలను సమీక్షించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి అవైస్ చిస్తీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో 2026-27 వార్షిక బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘దివ్యాంజన్ సెక్షన్ ‘ను ప్రారంభించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖకు పంపాలని తీర్మానించారు.
TG: యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా సాయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. సంక్రాంతికి, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినా.. ఇప్పటివరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. నిన్న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
NZB: తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మన్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డికి మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి వినతిపత్రం అందజేశారు. యార్డుల అభివృద్ధి పనులు మంజూరులో జాప్యం, ఛైర్మన్ గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
SDPT: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కోసం 36 ఎకరాల భూమి కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. అలాగే చిగురు మామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3.12 ఎకరాలను దేవాదాయ శాఖకు కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు.
MBNR: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం,నిర్మాన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ (మహిళల)లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఎస్సెస్సీ, అంతకంటే పై విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత తమ విద్యాసర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
ADB: జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ హాల్ టికెట్ అందజేయాలని PDSU జిల్లా కార్యదర్శి కుమ్ర అశోక్ తెలిపారు. ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకపోతే సంబంధిత యాజమాన్యాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో పరీక్ష రాసే అవకాశం కల్పించిందని తెలిపారు.
ATP: అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురంలోని శ్రీచైతన్య కళాశాలలో ముగ్గురు, ఎస్ఎల్ఎన్ కళాశాలలో ఆరుగురు విద్యార్థులు పట్టుబడ్డారు.
SRCL: వార్డు సభ్యులు పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో రాధా అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు కూడా కీలక పాత్ర వహిస్తారని తెలిపారు.
NLG: మర్రిగూడ మండలం బట్లపల్లిలో చైనా మాంజా చుట్టుకుని నెమలి మృతి చెందింది. రైతు పొలంలో ఆహారం కోసం వెళ్లిన నెమలి కాళ్లకు దారం చుట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేశ్ సమక్షంలో పశువైద్యాధికారి సురేందర్ పోస్టుమార్టం నిర్వహించి, నెమలిని ఖననం చేశారు. పర్యావరణానికి హానికరమైన చైనా మాంజాను వాడొద్దని అధికారులు సూచించారు.
కర్నూలులో పట్టణ ప్రణాళిక అధికారులు, సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో అనుమతులు లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) ఆధారంగా ఉక్కుపాదం మోపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలో GIS డేటా ఆధారంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి అకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.
శ్రీకాకుళం పట్టణం సంతోషిమాత ఆలయ సమీపంలో మార్చి 1న ఉదయం 8 గంటల నుంచి ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు లిటిల్ మాస్టర్స్ తల్లీ పిల్లల ఆస్పత్రి ప్రతినిధులు డాక్టర్ అన్వేష్, డాక్టర్ వాసంతి తెలిపారు. షుగర్, బీపీ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: మహిళల భద్రతకు భరోసా అయిన “శక్తి” యాప్ పై విస్తృతంగా శక్తి బృందాలు అవగాహన కల్పించాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా “శక్తి” యాప్ పై సోమవారం సాయంత్రం, వివిధ విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్టాండ్లు, తదితర ప్రజా ప్రదేశాల్లో మహిళలకు, మరియు విద్యార్థినిలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
WGL: నగరంలోని గిర్మాజీపేటలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా “న్యూలెమన్ సోడా” తయారు చేస్తున్న సమాచారం మేరకు నేడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వ్యాపారి వెంకటేశ్వర్లు ఇంట్లో రూ. 24 వేల విలువైన సోడా సీసాలు, సామగ్రిని స్వాధీనంచేసుకున్నారు. వాటిని ఆహార భద్రత అధికారులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
TG: నారాయణపేట జిల్లాలో పెళ్లి జరిగిన మూడు రోజులకే వరుడు చాకలి రవి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్వ మండల కేంద్రానికి చెందిన చాకలి రవితో కర్నూలుకి చెందిన యువతితో ఈ నెల 20న పెళ్లైంది. తర్వాత రోజు భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహించిన రవి భార్యను కొట్టాడు. ఈ విషయం వధువు కుటుంబసభ్యులకు తెలిసి.. వారు గొడవ పెట్టుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రవి ఆత్మహత్య చేసుకున్నాడు.