• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చరిత్ర సృష్టించిన టీమిండియా

ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరడంతో ఈ ఘనత సాధించింది. ODI WC – 8 సార్లు, T20 WC – 6 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో 6 సార్లు సెమీస్ చేరుకుంది. భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్‌ (18) ఉన్నాయి.

March 2, 2026 / 05:16 PM IST

రేపు సెలవు.. ఎల్లుండి యధావిధిగా నిర్వహణ

ATP: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర గణితం పరీక్షకు 15,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 269 మంది, ఒకేషనల్‌లో 139 మంది గైర్హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు. అలాగే హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పరీక్ష ఉండదని, టైమ్ టేబుల్ ప్రకారం మార్చి 4 నుంచి పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.

March 2, 2026 / 05:15 PM IST

‘ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి’

అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ కె.హరితని సోమవారం కాగజ్‌నగర్ మున్సిపల్ నూతన పాలకవర్గం వైస్ ఛైర్మన్, BRS కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

March 2, 2026 / 05:14 PM IST

పీజీఆర్ఎస్‌కి విశేష స్పందన

VZM: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. అందిన మొత్తం 200 వినతుల్లో అత్యధికంగా 95 రెవెన్యూ శాఖవే ఉన్నాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, వినతులు పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

March 2, 2026 / 05:14 PM IST

సీఏ ఫైనల్లో ఉత్తీర్ణత సాధించిన సాయికుమార్

KMR: జిల్లాలో తాజాగా విడుదలైన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫైనల్ ఫలితాల్లో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన సాయికుమార్ నీలావర్ ఉత్తీర్ణత సాధించారు. ఆయన తండ్రి మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున నీలావర్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పట్టుదలతో కృషి చేసి ఈ విజయాన్ని సాధించినట్లు సాయి తెలిపారు.

March 2, 2026 / 05:14 PM IST

చెస్ పోటీల్లో మొదటి స్థానంలో జిల్లా వాసి

AKP: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లీగ్ చెస్ పోటీల్లో అండర్ 15 విభాగంలో అనకాపల్లి జిల్లాకు చెందిన బి శ్రావ్యశ్రీ మొదటి స్థానంలో నిలిచింది. అండర్ 13 విభాగంలో బి. సహస్ర, అండర్ 17 విభాగంలో వి. వెంకటేశ్వరరావు మూడో స్థానం సాధించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజను జాయింట్ కలెక్టర్ అభినందించారు.

March 2, 2026 / 05:13 PM IST

‘ఐవీఆర్ఎస్ కాల్స్‌కు స్పందించాలి’

ASR: ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్‌కు తప్పకుండా స్పందించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు ప్రజలను కోరారు. ఆయన సోమవారం రావణాపల్లిలో పర్యటించారు. పంచాయతీలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలన్నారు.

March 2, 2026 / 05:12 PM IST

‘పీజీఆర్ఎస్‌కు 54 ఫిర్యాదులు’

CTR: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు అందాయన్నారు.

March 2, 2026 / 05:11 PM IST

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు.. ఎంత శాతమంటే?

ఉద్యోగ భవిష్య నిధి (EPF)పై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) 8.25 శాతంగా కొనసాగించాలని EPFO నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో జరిగిన 239వ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే వడ్డీరేటు అందించగా.. ఈసారి కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

March 2, 2026 / 05:11 PM IST

పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఎంపీ

VSP: పేదల ఆరోగ్యానికి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నామని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఎంపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా 22 లక్షల పైగా మంజూరైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను బాధితులకు ఎంపీ చేతుల మీదుగా అందజేశారు.

March 2, 2026 / 05:11 PM IST

గ్రామాల అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే

PDPL: జూలపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి కాచాపూర్ గ్రామం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

March 2, 2026 / 05:10 PM IST

మాజీ స్పీకర్‌కు ఎస్పీ నివాళులు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైతిక విలువలతో, ప్రజల పట్ల అంకితభావంతో సేవలందించిన నాయకుడు శ్రీపాద రావు అని స్మరించుకున్నారు.

March 2, 2026 / 05:09 PM IST

ఎల్లుండి విశాఖలో జగన్ పర్యటన

AP: మాజీ సీఎం జగన్ ఎల్లుండి విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్లానున్నారు. ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను ఆశీర్వదించనున్నారు.

March 2, 2026 / 05:08 PM IST

కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి

NLG: దివంగత శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ చంద్రశేఖర్, పలువురు అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

March 2, 2026 / 05:08 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టండి’

SRPT: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 83 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెండింగ్‌ దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 05:07 PM IST