MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో మరణించిన హోంగార్డ్స్ కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుండి విడుదలైన చెక్కులను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కే. శ్రీనివాస్ గురువారం పంపిణీ చేశారు. హోంగార్స్ డీ. తిరుపతి, ఎం. రాములు కుటుంబ సభ్యులకు రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
KDP: జిల్లా బాలల సంరక్షణ పథకంలోనిని శిశు గృహ, ప్రాంతీయ బాలసదనం, అక్కాయపల్లె బాల సదనం, కొండాయపల్లె బాలసదనాల్లో ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికే షన్ రద్దు చేసినట్లు ICDS, PD రమాదేవి తెలిపారు. గతేడాది అక్టోబరు 13వ తేదీన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని కొన్ని అనివార్య కారణాలతో కలెక్టర్ ఆదేశాల ప్రకారం రద్దు చేసామన్నారు.
KRNL: జిల్లా మర్దూర్ నగర్లోని అమ్మ వృద్ధాశ్రమానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ఫ్యాన్లను విరాళంగా అందించారు. వేసవిలో ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఇబ్బందులు పడకూడదని, తనవంతు సాయం చేసినట్లు ఆయన తెలిపారు. పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆయన కోరారు. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను విడిచిపెట్టడం సరికాదన్నారు.
AKP: నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా నక్కపల్లిలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ఎలా శంకుస్థాపన చేస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా శంకుస్థాపన చేయవద్దని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీఎంకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లేఖ ప్రతులను ప్రదర్శించారు.
NLR: విడవలూరు మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. మండలంలోని పార్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, ఓవర్ హెడ్ ట్యాంకు, డ్రైనేజీను ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
CTR: ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద కూటమి ప్రభుత్వం గురువారం కుప్పం నియోజకవర్గంలోని మత్స్యకారుల సొసైటీలకు సుమారు 77 వేల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. ఇందులో భాగంగా చిన్న బంగారునార్థం చెరువులో సుమారు 46 వేల చేప పిల్లలను అధికారుల సమక్షంలో చెరువులోకి వదిలారు. చేపలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు.
JGL: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.
AP: విశాఖకు డేటా సెంటర్లు తీసుకొచ్చిందే జగన్ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములు కాపాడాలనే గురుమూర్తి పిల్ చేశారు. విశాఖ భూదోపిడీపై బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాం. ఎన్ని కంపెనీలు స్థాపించారు.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. భూ కేటాయింపులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ప్రకాశం: దొనకొండ ఎస్సై, సిబ్బంది ముందస్తు సమాచారంతో వి.వి పురం గ్రామంలో ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.17,420ల నగదు, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
TG: రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ప్రాజెక్టు అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
BDK: ఆళ్లపల్లి మండలం నడిమిగూడెం గ్రామంలో ఆదివాసీలు గడ్డి కోమరాజు జాతర నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసి సంస్కృతి సంప్రదాయం తో కూడిన నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. జాతరలు నిర్వహించడం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగం అని తెలిపారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఉండేలా సీసీ రోడ్డు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన బైక్‌లు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయని సీఐ సత్యనారాయణ తెలిపారు. చెత్తకు నిప్పు పెట్టడంతో అది ప్రమాదవశాత్తు వచ్చి స్టేషన్ ఆవరణలోని వాహనాలకు వ్యాపించిందన్నారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పి వేశారని పేర్కొన్నారు.
KMM: మైనారిటీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మసీదు కమిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మహిళలకు గురువారం వారు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఈ నెల 14వ తేదీన షటిల్ టోర్నమెంట్ ప్రారంభించనున్నట్లు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ. 7,500, తృతీయ బహుమతి రూ. 5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.