MDK: చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ తండాలో ఈనెల 19న గోదానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది రైతులకు గోదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోవుల ద్వారా వచ్చే పేడ, మూత్రం ద్వారా నూనె, సబ్బులు తదితర ప్రోడక్ట్ వంటివి తయారు చేసేందుకు పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వారు తెలిపారు.
W.G: భీమవరం టు టౌన్ రైల్వే స్టేషన్‌లో మాదు వెంకటేశ్వరరావు (66) అనే వ్యక్తి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెంకటేశ్వరరావు పాలకొల్లు మండలం లంకల కోడేరు వెదుళ్లపాలేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
NLR: మరిపాడు మండలం నందవరంలో కుక్కల బెడద ఎక్కువైంది. గ్రామ వీధులలో విచ్చలవిడిగా సంచరిస్తూ పలువురిపై దాడులు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులను సైతం వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గత రాత్రి ఓ మహిళను కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో ఆ మహిళలకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
HYD: పేదలకు ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా ఉపయోగపడుతుందని కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు ఆఫీస్‌లో మహమ్మద్ అబ్దుల్ వాహెద్‌కు రూ. 2లక్షల విలువచేసే CMRF చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
VSP: విశాఖ నగరంలో RK బీచ్ కాళీమాత దేవాలయం సమీపంలో ఈ నెల 19న యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు వేమన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఆశీలమెట్ట వద్ద గల వేమన విగ్రహానికి ఆరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామన్నారు.
కర్నూలు: జిల్లాలో డీసీసీబీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కర్నూలు డీసీసీబీలో 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల్లో పీఏసీఎస్ ఇన్‌సర్వీస్ ఉద్యోగులకు 13 పోస్టులు కేటాయించనున్నట్లు పేర్కొంది. వయస్సు 20-30 ఏళ్లు ఉండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
AP: సంక్రాంతి రద్దీ దృష్ట్యా నడుపుతున్న విశాఖ-చర్లపల్లి జన్‌సాధారణ్ రైలు.. విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరింది. సరైన ప్రచారం లేక ప్రయాణికులు ఆ రైలు వైపు కన్నెత్తి చూడని వైనం నెలకొంది. అయితే విశాఖ నుంచి HYD వచ్చే మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రైలు సర్వీసులు సరిపోక ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. కాగా, అధికారుల నిర్వాకంతో చర్లపల్లి రైలు నిరుపయోగంగా మారింది.
AP: రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు కంపెనీలకు భూములు కేటాయింపులపై ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత డ్రెస్సింగ్ రూమ్ విషయాలను లీక్ చేసినట్లు సర్ఫరాజ్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. అతడిపై హెడ్ కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సర్ఫరాజ్‌పై వస్తోన్న ఆరోపణలు నిజమని ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. ఒకవేళ అలా జరిగితే మాత్రం అది పెద్ద తప్పిదమేనని.. అతడితో గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించాడు.
ఇళ్లలో ప్రతిరోజు అధికంగా వాడే ప్లాస్టిక్‌ను ఎలా సేకరించాలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ‘ప్రతి ఇంటి నుంచి కనీసం 10-20 ప్లాస్టిక్ కవర్లు(నూనె, పాలు, కిరాణా కవర్ల రూపంలో) రోజూ వస్తుంటాయి. మనం రోజూ డస్ట్‌బిన్‌లకు బదులు వాటర్ బాటిళ్లలో ఆ కవర్లు వేయాలి. ఇలా చేయడం వల్ల జంతువులు తినకుండా ఆపవచ్చు. పారిశుద్ధ్య కార్మికులకు సులువుగా ఉంటుంది’ అని అన్నారు.
VZM: కొత్తవలస మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పురాతన కళ్యాణ వేదిక వద్ద గత కొంతకాలంగా బిక్షటను చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న కొత్తవలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పంచాయతీ సిబ్బంది కొత్తవలస స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.
W.G: పెనుగొండ పెద్దపేట అయ్యప్ప మాల గురుస్వామి నౌభత్తు నల్లమోహన్ గురువారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. పెనుగొండ పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప భక్తులకు ప్రత్యేకమైన పడిపూజ, హారతి ఇవ్వడంలో ఈయన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నల్ల మోహన్ గురుస్వామి మరణం పట్ల పెనుగొండ సర్పంచ్ శ్యామల సోనీ, పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
HYD: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలింనగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
HYD: పాస్‌పోర్టు కోసం సమర్పించాల్సిన ధ్రువపత్రాల్లో విదేశాంగశాఖ స్వల్ప మార్పులు చేసింది. 2023 అక్టోబరు 1న, ఆ తర్వాత పుట్టినవారు పాస్‌పోర్టు పొందాలంటే జనన ధ్రువపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేసింది. పుట్టిన తేదీ ధ్రువీకరణకు 8 రకాల పత్రాల్లో ఒకదానిని సమర్పించాలన్న నిబంధనను ఈ వయసు వారికి సంబంధించి ఇటీవలే సవరించింది.
NZB: ఈనెల 22, 29 తేదీల్లో సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. మొబైల్ నంబర్‌కు వచ్చిన మెసేజ్ ప్రకారం క్యాంపుకు హాజరుకావాలని సూచించారు. ఈ క్యాంపుకు హాజరయ్యే వారు స్లాట్ రసీదు, పాస్‌ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.