కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి కేటీఆర్.. సవాల్ విసిరారు. తాను చెప్పేది తప్పయితే… తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ చెప్పారు. అదే.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించామని అన్నారు. అందులో 1 లక్షా 68 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.
కేంద్ర మంత్రికి, మిగిలిన బీజేపీ ఎంపీలకు కేసీఆర్ పై విమర్శలు చేయడం తప్ప ఇంకో పని లేదని కేటీఆర్ విమర్శించారు. ఇక కనీస పరిజ్ఞానం లేకుండా బిజెపి నాయకులు మాట్లాడుతున్నారన్న కేటీఆర్ జాతీయ పార్టీలు రెండు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని అన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం.. కేంద్రం కంటే భారీగా పెరిగిందని పేర్కొన్న కేటీఆర్ 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే… ప్రధానిగా మోడీ చేసిన అప్పు చాలా ఎక్కువని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆ అప్పు భవిష్యత్తు మీద పెట్టుబడి మాత్రమేనని అన్నారు. ఆ పెట్టుబడి ద్వారా సంపాదన సృష్టించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్ళు మాత్రమే బాగుపడ్డారని పేర్కొన్న కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినా జెండా, ఎజెండా, మనుషులు, డిఎన్ఏ, మారలేదని అన్నారు.