జగిత్యాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్… అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు.. ఇవాళ ఒక అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల, ప్రజలను హృదయపూర్వకంగా అభినందలు, శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. కలలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయితదని, ఇలా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైందని అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
‘ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన, అద్భుతమైన నరసింహాస్వామి ధర్మపురికి వచ్చానని, ఆ రోజు ఒక మాట చెప్పా, గోదావరి నది.. నాటి ఏపీలో తెలంగాణలో మొదట ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరు అని సింహాంలా గర్జించా, దాని మీద చాలా రకాలుగా మాట్లాడారని అన్నారు. ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైన స్వామి, ఆయనను దర్శించి నీ దయ వల్ల పుష్కరాలు జరుపుదాం అని మొక్కుకున్నాను. మళ్లీ పుష్కరాలు వచ్చే లోపు రాష్ట్రాన్ని సాధించి, ఇక్కడే పుష్కరాలు జరుపుదామని మొక్కాను. నిండు మనసుతో మొక్కాను. ధర్మపత్ని సమేతంగా వచ్చి తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామి వారిని దర్శించుకున్నాను. పండితులు తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవెన ఇచ్చారు. స్వామి వారి దయ, వేదపండితుల ఆశీస్సులతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పుష్కరాలు జరుపుకున్నాం. లక్షలాది మంది ధర్మపురికి తరలివచ్చారన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక పరిమళాలు ఉన్న ప్రాంతం. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు అంజన్న దేవాలయంతో పాటు పలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొండగట్టు అంజన్న సన్నిధికి హనుమాన్ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. అంజన్న దేవస్థానం కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఉండేదనీ, 384 ఎకరాల స్థలాన్ని దేవాలయానికి ఇచ్చాం. 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే నేను స్వయంగా వచ్చి ఆగమశాస్త్ర ప్రకారం, భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను’ అని కేసీఆర్ ప్రకటించారు.