ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయ ఢంకా మోగించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఇటీవల పోలింగ్ జరగగా.. నేడు.. ఆ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కాగా… ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ సాధించింది. ఆప్‌కి చెందిన 131 మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. అదే సమయంలో బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. 2007 నుంచి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ని బీజేపీనే పాలిస్తూ ఉండగా… ఇప్పుడు ఆప్ చేతికి అధికారం దక్కడం విశేషం.
మెజారిటీ దాటి ఆప్ విజయం దిశగా దూసుకుపోవడంతో ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, కేజ్రీవాల్ నినాదాలు హోరెత్తించారు.
ఢిల్లీ ప్రజల నుంచి బీజేపీకి తగిన సమాధానం లభించిందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. అభివృద్ధి కోసం పాటుపడే వారికే ప్రజలు పట్టం కట్టారని ఢిల్లీని ప్రపంచంలోనే అందమైన నగరంగా మారుస్తామని అన్నారు. దీంతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆప్ కార్యకర్తలు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇక మరోపక్క రోహ్తాస్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి కంచుకోటగా నిలిచిన చోటే బీజీపీకి చుక్కెదురైంది. రోహ్తాస్ నగర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి శివాని పంచల్ గెలుపొందారు. ఆమె వయసు 24 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం శివాని డీటీయూలో పీజీ చేస్తోంది. అలాగే ఆమె UPSC కోసం కూడా సిద్ధమవుతోంది. శివాని మొత్తం ఎన్నికల్లో విద్యపైనే పోరాడారు. శివాని బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ షుమన్లత నగర్‌పై విజయం సాధించారు. శివాని తండ్రి ఆరు నెలల క్రితం చనిపోగా నలుగురు తోబుట్టువుల్లో శివాని చిన్నదని అంటున్నారు.