ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్తుండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ఫైలట్ దించారు. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో మార్గం కనిపించలేదు. దీంతో చాపర్‌ను కిందకి దించాల్సి వచ్చింది.
తమిళనాడు ఈరోడ్ జిల్లా కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగింది. హెలికాప్టర్లో రవిశంకర్‌తోపాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించే వరకు రవిశంకర్ వేచి ఉన్నారు. గంట తర్వాత పొగమంచు తొలిగిపోవడంతో అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు.
ఉదయం 9.50 గంటలకు హెలికాప్టర్‌ను పైలట్ ల్యాండ్ చేశారు. వాతావరణం చక్కబడిన తర్వాత ఉదయం 11 గంటలకు బృందంతో కలిసి రవిశంకర్ హెలికాప్టర్లో బయల్దేరారు. ఈ నెల 8వ తేదీన కూడా ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఇదే విధంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. కడంబూర్ హిల్స్‌లో గల అతియార్ గ్రామంలో చాపర్ దింపారు. ఆ హెలికాప్టర్ కర్ణాటక నుంచి కోచి మీదుగా కేరళ వెళుతుంది. వాతావరణం చక్కబడిన రెండున్నర గంటల తర్వాత తిరిగి బయల్దేరింది.