»Show The Ink And Sign Up For Discounts On Metros Food Hotels And More
2024 elections : ఓటేస్తే ఫ్రీ టిఫిన్.. ఫ్రీ బస్.. సినిమా టికెట్లపై డిస్కౌంట్!
ఓటింగ్ శాతాన్ని పెంచేందు కోసం అటు ప్రభుత్వ సంస్థలు, ఇటు ప్రవైటు సంస్థలు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సిరా గుర్తు చూపిస్తే చాలు రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. అవేంటంటే..?
2024 elections offers for voters : ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు వారు కూడా అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో ఓటేసి వచ్చిన వారికి ఫ్రీ జర్నీ అంటూ మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అలాగే ఇండోర్‌లోని కొందరు వ్యాపారులు ఓటేసి వచ్చి సిరా గుర్తు చూపిస్తే ఫ్రీ టిఫిన్, జిలేబీ లాంటి వాటిని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా గురుగ్రామ్‌లో మే 25న జరగబోయే ఎన్నికల్లో ఓటేసి వచ్చిన వారికి ఓ మల్టీ ప్లెక్స్‌లో సినిమా టికెట్లపై డిస్కౌంట్(discount) ప్రకటించారు. అలాగే మే 20న జరగబోయే ఎన్నికల్లో ఓటేసి వచ్చిన వారికి ముంబయి మెట్రో లైన్లు, 2ఏ, 7ల్లో పది శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
ఇలా రకరకాల సంస్థలు, దుకాణాల వారు ఓటర్లను ప్రోత్సహించేందుకు డిస్కౌంట్లు(discounts), ఆఫర్లు(offers) ప్రకటిస్తుండటం మనం చూస్తున్నాం. ఇంకా నాలుగు దశల ఎన్నికలు మే13, మే20, మే 25, జూన్ 1న జరగనున్నాయి. వాటిలో పోలింగ్ శాతాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే వీరంతా ఇలా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. గత మూడు విడుతల ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదు కావడంతో ఇప్పుడు ఓటింగ్‌పై అంతా అవగాహన కల్పిస్తూ ఇలా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మొదటి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71 శాతం, మూడో విడతలో 65.68 శాతంగా మాత్రమే పోలింగ్ నమోదైంది. మొదటి రెండు విడతలతో పోలిస్తే మూడో విడతలో మరీ తక్కువ పోలింగ్ నమోదైంది. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు అధికారులు, వ్యాపారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.