Google Wallet Launched In India : ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులో ఉన్న గూగుల్ వ్యాలెట్(GOOGLE WALLET) యాప్ ఇప్పుడు భారత్‌లోనూ లాంచ్ అయ్యింది. ఇది ఒక ప్రైవేట్ డిజిటల్ వ్యాలెట్. దీనిలో మనం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, గిఫ్టు కార్డులు, పాస్‌లు, టికెట్లు, కీలు, లాయల్టీ కార్డులు, ఐడీల్లాంటి వాటిని ఎంతో సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. అయితే దీని ద్వారా చెల్లింపులు చేయడానికి మాత్రం కుదరదు. అందుకోసం మనం గూగుల్ పేని వాడుకోవాల్సి ఉంటుంది.
మనకు ఆర్థిక పరమైన లావాదేవీల కోసం ఉపయోగపడే కార్డులు, ఐడీల్లాంటి వాటిని ఇందులో డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు. అయితే ఇది పేమెంట్ యాప్ మాత్రం కాదని సంస్థ వెల్లడించింది. విమాన టికెట్లు, స్టూడెంట్ ఐడీలు, బోర్డింగ్ పాసుల్లాంటి ముఖ్యమైన వాటన్నింటినీ మనం ఇందులో భద్రపరుచుకోవచ్చని తెలిపింది.
గత కొన్ని రోజులుగా భారత్‌లో(INDIA) త్వరలో ఈ గూగుల్ వ్యాలెట్(GOOGLE WALLET) యాప్ అందుబాటులోకి వస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ చాలా త్వరగా ఈ యాప్‌ని ఇక్కడ గూగుల్ విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.