Google Wallet : భారత్‌లో విడుదల కానున్న ‘గూగుల్ వాలెట్’
భారత్‌లో త్వరలోనే ‘గూగుల్ వాలెట్’ లాంఛ్ కాబోతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. మరి ఇంతకీ గూగుల్ వాలెట్ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? తెలుసుకుందాం రండి.
Google Wallet : వినియోగదారుల సౌకర్యార్థం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఈ సంస్థ త్వరలో గూగుల్ వాలెట్ ని భారత్‌లో తీసుకొస్తుందని వార్తలు వస్తున్నాయి. మల్టీ పర్పస్‌గా దీన్ని వాడుకోవచ్చని తెలుస్తోంది. మరి దీన్ని ఎలా వాడుకోవచ్చు? దీని వల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందామా?
మనం షాపింగ్‌కి వెళ్లేప్పుడు లేదా బయటకు వెళ్లేప్పుడు పర్స్ తీసుకెళతాం. క్రిడిట్, డెబిట్ కార్డులు, ఈవెంట్ టిక్కెట్స్, ఎయిర్‌లైన్ బోర్డింగ్ పాసులు, స్టూడెంట్ ఐడీల్లాంటి వాటిని దానిలో భద్రపరుచుకుంటాం. అయితే వీటన్నింటినీ డిజిటల్ ఫార్మాట్లో గూగుల్ వాలెట్లో(GOOGLE WALLET) దాచుకోవచ్చన్నమాట. అలా మీరు క్రెడిట్, డెబిట్ కార్డ్స్ కోసం ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. ఈ సేవలు ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌లో మాత్రం అందుబాటులో లేవు. దీంతో ఈ యాప్ కొద్ది రోజుల్లో ఇక్కడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
అయితే గత మూడు నెలలుగా కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ వాలెట్‌ను తమ ఫోన్లలో వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా కొన్ని చెల్లింపులు, రివార్డులు, పాస్‌లు, టిక్కెట్లను WearOS అనే థర్డ్ యాప్ సాయంతో వాడుతున్నట్లు తెలిపారు. అయితే గూగుల్ వాలెట్ భారత్‌లో మాత్రం అధికారికంగా అందుబాటులో లేదు. గత కొన్నాళ్లుగా భారత్‌లో గూగుల్ వాలెట్(GOOGLE WALLET) ప్రారంభిస్తుందని ఎన్నో రూమర్స్ వస్తున్నప్పటికీ గూగుల్ మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే త్వరలో గూగుల్ వాలెట్ భారత్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.