People Ready to Vote in AP : ఈ నెల పదమూడో తారీఖున ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) లోక్‌సభ, శాసన సభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జనం ఆంధ్రప్రదేశ్‌కు తరలి వస్తున్నారు. దీంతో అటు నుంచి ఆంధ్ర వైపు వస్తున్న బస్సులు, రైళ్లు అన్నీ చాలా రద్దీగా కనిపిస్తున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్లు, బస్సులు వెయ్యాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఓ వైపు ఎండలు మండిపోతున్నా ఆంధ్ర ఓటర్లు మాత్రం ఉత్సాహంగా తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్(hyderabad) నుంచి విజయవాడ వైపుగా వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ ఎక్కడా ఖాళీ ఉండటం లేదు. అటు టీఎస్ ఆర్టీసీ బస్సులు, ఇటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కూడా రద్దీగానే కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేటు బస్సు టికెట్ల కోసం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తోంది. దీంతో వారు ఉన్నట్లుండి ఛార్జీలను పెంచేస్తున్నారని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నానరు.
ఇక ప్రైవేటు వాహనాల్లో సొంత ఊళ్లకు చేరుకోవాలనుకునే వారు టికెట్ల ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైళ్ల రిజర్వేషన్ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. కొన్ని రోజుల ముందు నుంచే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తున్న రిజర్వేషన్ టికెట్లు ఇప్పుడు ‘రిగ్రెట్’ లోకి వెళ్లిపోవడం గమనార్హం. హైదరాబాద్ (hyderabad) నుంచి నర్సాపురం వెళ్లే రైళ్లు, అటు తిరుపతి వైపు వెళ్లే రైళ్లు, అలాగే విశాఖ పట్టణం వెళ్లే రైళ్లలోని రిజర్వేషన్ల పరిస్థితి ఇలానే ఉందని చెబుతున్నారు. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.