ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అధికార, రాజకీయ, కార్యక్రమాల కోసం ఆయన తెలంగాణ వస్తున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయ్యింది. పర్యటన ఇప్పుడు వాయిదా పడిందని.. త్వరలో ప్రధాని మోడీ తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ పర్యటన ఏర్పాట్లలో ఇప్పటికే బీజేపీ నేతలు నిమగ్నం అయ్యారు. హైదరాబాద్‌లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం కోసం రావాల్సి ఉంది. తొలుత హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వందే భారత్ రైలు నడవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు.
సికింద్రాబాద్- విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు మోడీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఖాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు ప్రారంభించాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నేతలు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఆ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే పర్యటన వాయిదా పడటంతో బీజేపీ శ్రేణులు కాస్తా నిరుత్సాహనికి గురయ్యారు. ఇప్పటికే ఏర్పాట్లలో ఉన్నామని, చివరి క్షణంలో ఇలా జరిగిందని వారంతా అంటున్నారు. ప్రధాని ప్రధాని మోడీ షెడ్యూల్లో మార్పుల వల్ల పర్యటన వాయిదా పడిందే తప్ప మరే కారణం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రధాని మోడీ రాకపోవడంతో ప్రారంభోత్సవాలను వాయిదా వేశారు. అధికారిక కార్యక్రమాలతోపాటు రాజకీయ కార్యక్రమాలు ఉన్న పర్యటనకు మోడీ రాకపోవడం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చకు దారితీసింది.
అదేరోజు ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఉంది. ఖమ్మం కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన తర్వాత.. ఆ ప్రాంగణంలోనే సభ నిర్వహిస్తారు. వేదికపై సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్, మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి తదితర ముఖ్య నేతలు ఉంటారు. ఆ సభ కోసమే.. మోడీ పర్యటన వాయిదా పడిందా..? లేదంటే మరే కారణం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా మోడీ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడటాన్ని కూడా బీజేపీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతుంది.