దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలిచిన బాలాసోర్ (Balasore) రైల్వే ప్రమాద ఘటనలో సీబీఐ (CBI) చార్జిషీటు దాఖలు చేసింది.ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. ఇప్పటికే సెక్షన్ ఇంజినీర్ (signals) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్‌లను అరెస్ట్ చేసింది. తాజాగా వారిపై హత్యానేరం తోపాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారని చార్జిషీటు(Charge sheet)లో అభియోగాలను మోపింది సీబీఐ.
బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ (Level crossing) వద్ద LC గేటు నెంబర్ 79 సర్క్యూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత విధి నిర్వహణలో అలసట కనబరుస్తూ టెస్టింగ్ నిర్వహించాలి. అందులో ఏమైనా వైఫల్యాలు (failures) ఉంటే మార్పులు చేసి వాటిని సరిచేయాలి. కానీ మహంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ (Interlocking) ఇన్స్టాలేషన్ కూడా ప్రణాళికాబద్ధంగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. రైల్వే చట్టం(Railway Act) లోని 153 సెక్షన్‌తో పాటు సాక్ష్యాలను నాశనం చేసే యత్నం, హత్యతో సమానమైన నేరాభియోగాలను మోపింది. రైలు ప్రమాదంలో కుట్రకోణం అనుమానాల నేపథ్యంలో సీబీఐ (CBI) రంగంలోకి దిగింది.