కార్లలో ఎయిర్ బ్యాగులకు సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు ఎయిర్ బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం అనుకోవడం లేదని గడ్కరీ అన్నారు. కార్లలో ప్రయాణికుల భద్రత కోసం ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆరు ఎయిర్ బ్యాగులు (Air bags) నిబంధన తీసుకురానున్నట్లు గతంలో మంత్రి చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఏఎంసీ (AMC) కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కొత్త క్రాష్ టెస్ట్ రూల్స్‌ను అమలు చేసిన తర్వాత.. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనలు అమలులోకి తీసుకువస్తామన్నారు. కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చేందుకు భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (BNCAP)ను ఇటీవల తీసుకొచ్చినట్లు గడ్కరీ తెలిపారు. దీంతో ఒక కారు 5 స్టార్ రేటింగ్ పొందాలంటే 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మెరుగైన స్టార్ రేటింగ్ (Star rating) అందుకునే క్రమంలో ఆరు ఎయిర్‌బ్యాగులను కార్ల కంపెనీలు అమర్చాల్సి ఉంటుందని, అందుకే తాము తప్పనిసరి చేయాలని అనుకోవడం లేదని గడ్కరీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రయాణికుడికి ప్రాణాలను రక్షించేందుకు ఎయిర్‌బ్యాగులు ఉపయోగపడతాయన్న సంగతి తెలిసిందే. దేశంలో 2021 ఏప్రిల్ 1 నుంచి కారు ముందు వరుస సీట్లకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి నిబంధన అమలవుతోంది. ప్రస్తుతం వినియోగదారులకు సైతం భద్రతపై అవగాహన పెరిగిందని, ఈ క్రమంలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లను అందించే వాహనాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. అయితే, గతేడాదిలో కేంద్రమంత్రి కొత్త ప్యాసింజర్ కాస్లలో ఆర్ ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది టాటా అండ్ సన్స్ మాజీ ఛైర్మన్ సైరన్ మిస్త్రీ (Siren Mistry) కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కారు వెనుక సీటులో కూర్చున్న సమయంలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంపై కేంద్ర రవాణా శాఖ సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ క్రమంలో కారు ముందు సీట్లో కూర్చున్న వారేకాకుండా వెనుకసీట్లో కూర్చున్న వారు సైతం సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో సరికొత్త నిబంధనలు తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. నిన్న సైతం డీజిల్ వాహనాల(Diesel vehicles)పై అదనంగా జీఎస్టీని విధించనున్నట్లు కేంద్రమంత్రి ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈవీ వాహనాలను ప్రోతహిస్తూ కాలుష్యాన్ని విడుదల చేసే డీజిల్ కార్లపై అదనంగా 10శాతం జీఎస్టీ పెంచాలని ఆర్థికశాఖ మంత్రికి ప్రతిపాదనలు అందజేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆటోరంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆ తర్వాత స్పందించిన కేంద్రమంత్రి ఇప్పటికప్పుడే డీజిల్ ఇంజిన్ వాహనాలపై జీఎస్టీ(GST)ని విధించే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదని వివరణ ఇవ్వడం కొసమెరుపు. ఈ క్రమంలో ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందా? లేదా? ప్రశ్నార్థకంగా మారింది.