Gold biscuits: కోటిన్నర విలువైన గోల్డ్ బిస్కెట్స్ పట్టివేత
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా సరిహద్దు ప్రాంతాల్లో బంగారం బిస్కెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి ఏకంగా కోటిన్నర విలువైన గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మేఘాలయ రాష్ట్రంలోని డియెంగ్పాసోహ్ వద్ద ఓ వాహనం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1.42 కోట్ల విలువైన 20 బంగారు బిస్కెట్లను (2331.82 గ్రాముల బంగారం) షిల్లాంగ్(Shillong) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న సరుకు జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేయబడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
పలు వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు(customs officers) సరిహద్దు ప్రాంతాల వద్ద నిఘా ఉంచడంతో ఈ గోల్డ్ లభ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పట్టుకున్న బంగారం నేపథ్యంలో పట్టుబడిన వ్యక్తి నుంచి అధికారులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను మొదటిసారిగా తీసుకుని వచ్చాడా లేదా గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడా అనే విషయాలను సైతం ఆరా తీస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో కొన్ని నెలల క్రితం అక్టోబర్లో కూడా ఆరు బంగారు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్న బృందం పట్టుబడింది. ఆ నిందితులు బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి అక్రమంగా పుత్తడిని తరలిస్తున్న క్రమంలో సరిహద్దు భద్రతా దళం వారిని పట్టుకుంది.