Gold fraud: జ్యువెలరీ యజమాని రూ.100 కోట్ల మోసం..బాధితుల ఫిర్యాదు!
పలు చోట్ల కొన్ని గోల్డ్ షాపుల యజమానులు నగదు ముందుగా కట్టడం ద్వారా తర్వాత బంగారు అభరణాలు తీసుకోవచ్చని ఆఫర్ల ఉన్నాయని కస్టమర్లకు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఓ షాపు యజమాని ఆఫర్ ఉందని చెప్పి వినియోగదారుల నుంచి ఏకంగా రూ.100 కోట్లకుపైగా తీసుకుని చీట్ చేశాడు.
తమిళనాడులోని తిరుచ్చి(Trichy), చెన్నై సహా పలు జిల్లాల్లో ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా ప్రణవ్ జ్యువెలరీ యజమాని మదన్ 100 కోట్ల రూపాయలకు పైగా ప్రజలను మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అయితే నగలు తీసుకునేందుకు నగదు పెట్టుబడుల రూపంలో ఖాతాదారులను మోసం చేసినట్లు మొత్తం 635 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రణవ్ జ్యువెలరీ యజమాని గురించి ఆరా తీసుకున్నక్రమంలోనే.. మదన్ మధురై డాన్బెడ్ కోర్టులో లొంగిపోయాడు. దీంతో ఆర్థిక నేరాల శాఖ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ కేసులో మదన్ భార్య కార్తీకను తిరుచ్చి ఎకనామిక్ అఫెన్స్ పోలీస్ డీఎస్పీ లిల్లీ గ్రేస్ నేతృత్వంలోని బృందం అరెస్టు చేసింది. ఆమె నుంచి 2 సవర్ల నగలు, 52 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తిరుచ్చి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేసి నగల దుకాణం యజమాని మదన్, అతని భార్య కార్తీక, మేనేజర్ నారాయణన్ అనే ముగ్గురిపై మోసం, కుట్ర వంటి 4 కేటగిరీల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఇంకా ఈ కేసులో ఎంత మంది మోసపోయారనే విషయం గురించి కూడా వారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.