బడ్జెట్ కి సమయం అయ్యింది. త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే… ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజలకు అనుగుణంగా ఉండనుందని తెలుస్తోంది. ఆ మాటలను బట్టి ఈసారి మధ్య తరగతి ప్రజలను దృష్టిలోకి ఉంచుకొని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తనకు మధ్యతరగతి ప్రజల జీవితాల గురించి తెలుసని, తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపు పన్ను విధింపు విషయంలో కూడా నిర్మలా సీతారామన్ ఓ విషయం స్పష్టం చేశారు. సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం కలిగిన వారికి పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.
పాంచజన్య ఏర్పాటు చేసిన సభలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అనేక పథకాల గురించి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. దేశంలో 27 నగరాల్లో మెట్రో రైల్ నెట్ వర్క్ ప్రారంభిస్తున్నామని, 100 నగరాలను స్మార్ట్ నగరాలుగా తీర్ది దిద్దుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
దేశంలో మధ్యతరగతి జనాభా పెరుగుతోందని, వారి అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేస్తోందని, రానున్న రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.