»Another Windstorm The Death Toll In Chennai Has Reached 12
Chennai Floods: మరో వాయుగుండం..చెన్నైలో 12కు చేరిన మృతుల సంఖ్య!
భారీ వర్షాల వల్ల చెన్నైలో 12 మంది వరకూ మరణించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుంపర జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా అరేబియా సముద్రంలో మరో తుఫాను చెలరేగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మిచౌంగ్ తుఫాను (Michaung Cyclone) చాలా ప్రాంతాలను నాశనం చేసేసింది. చెన్నై (Chennai) నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. చెన్నైలో కురిసిన వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం చెన్నై నగరాన్ని ఆకలి వేధిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైతో పాటు, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ వరద ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో చెన్నై విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాలు జలమయం అయ్యాయి. భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది. చాలా చోట్ల రోడ్లు వరదలకు కొట్టుకుపోయాయి. భారీ చెట్లు పడిపోవడంతో వాహనరాకపోకలు చాలా చోట్ల ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
వర్షాలు తగ్గాయని అందరూ ఊపీరి పీల్చుకుంటున్న తరుణంలో అరేబియా సముద్రంలో మరో తుఫాను తరహా వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వాయుగుండం ఏర్పడటంతో అది తమిళనాడు, కేరళకు దగ్గర్లో ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం క్రమంగా బలపడుతుండటంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, బెంగాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.