భారత నావికాదళానికి చెందిన మిగ్ 29కె యుద్ధ విమానం గోవా సముద్ర తీరంలో కుప్పకూలింది. అయితే… అదృష్టవశాత్తు.. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగానే మిగ్-29 కే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
రోజువారీ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని, సమాచారం అందిన వెంటనే పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని వారు చెప్పారు.
కాగా మిగ్-29 కే యుద్ధవిమానాలు 2019 లో ఇండియన్ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి. విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది.
నేవీ అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం వలన పైలట్ సురక్షింతంగా బయటపడ్డాడు. శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రష్యాలో తయారైన మిగ్-29 కే విమానాల్లో కే-36D-3.5 ఎజెక్షన్ సీటుతో అమర్చబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు.
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్ హ్యాండిల్ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్ ముందుకు ఎజెక్ట్ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం దీని ప్రత్యేకత. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో రెండు మిగ్-29 కే విమానాలు కూలిపోయాయి. తాజాగా జరిగిన ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు.