Unemployment : భారత దేశంలో నిరుద్యోగ సమస్య అనేది నానాటికీ పెరిగిపోతోంది. దేశంలో ఉన్న నిరుద్యోగుల్లో ఏకంగా 83 శాతం మంది యువతే ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. ఐఎల్వో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్(ఐహెచ్డీ)లు కలిసి సంయుక్తంగా భారత ఉపాది నివేదిక 2024ను ప్రచురించింది. దాంట్లో ఈ ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.
నిరుద్యోగులుగా ఉన్న యువతలో( Unemployed Youth) అధికంగా సెకండరీ విద్య, ఆ పై చదువులు చదువుకున్న వారీ ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఐఎల్ఓ తెలిపింది. కరోనా సంక్షోభం సమయంలో భారత్‌లో ఉపాధి భారీగా పడిపోయిందని అంది. చదువుకొన్న యువత అధిక నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోందని తెలిపింది. 2000 సంవత్సరంలో 35.2శాతంగా ఉన్న వీరి సంఖ్య 2022 నాటికి రెంట్టింపై 65.7 శాతానికి చేరుకుందని పేర్కొంది. యువత అధికంగా ఉండే భారత్‌లో వారికి ఉపాధి కల్పన విషయంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని తేల్చింది.
భారతీయ యువతలో(indian Youth) నైపుణ్యాల లోపం కూడా ఎక్కువగా ఉందని తెలిపింది. యువతలో 90 శాతం మంది స్ప్రెడ్ షీట్లో మ్యాథమెటికల్ పార్ములాలు చేయలేకపోతున్నారని అంది. 60 శాతం మందికి ఫైళ్లను కాపీ పేస్టు చేయడం కూడా రాదని తెలిపింది. 75 శాతం మందికి అయితే మెయిల్‌కు అటాచ్మెంట్లు చేసి పంపించడమూ చేతకాదని పేర్కొంది. వీరి నైపుణ్యాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందన్నారు. అయితే ఈ విషయమై ఆర్థిక వేత్త సంతోష్ మల్హోత్రా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత ఆర్థికవేత్తలు సమస్యను గుర్తించి పరిష్కారం చూపే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. భారత్ జాబ్ మార్కెట్‌పై అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.