తమిళనాడులోని డీఎండీకేకి చెందిన ఎంపీ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Erode MP Death : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాలేదని తమిళనాడుకు చెందిన డీఎండీకే ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి(77) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. దీంతో పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు విచారంలో ములిగిపోయారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి గణేశమూర్తికి(GANESHAMURTHI) పార్టీ టికెట్టును కేటాయించలేదు. దీంతో ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లోనే గత ఆదివారం పురుగుల మందు తాగారు. వెంటనే ఆయన్ను కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన మరణించినట్లు(DEATH) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆసుపత్రి యాజమాన్యం గణేశమూర్తి పార్థివ దేహాన్ని పోలీసులకు అప్పగించింది. పోస్టు మార్టం నిమిత్తం వారు మృతదేహాన్ని ఐఆర్టీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన స్వస్థలం కుమారవలసు గ్రామానికి దాన్ని తీసుకెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడే ఆయనకు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.