గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార, ప్రతిపక్ష స్థానానికి ఎగబాకే పరిస్థితులు కనిపించనప్పటికీ, పార్టీ ట్యాగ్ విషయంలో ఊరట దక్కే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం గుజరాత్లో బీజేపీ 150 సీట్ల వరకు, కాంగ్రెస్ 20 సీట్లకు పైగా గెలుస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం డబుల్ డిజిట్ దక్కించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తుందని భావించారు. కానీ పోస్ట్ పోల్ సర్వే ఫలితాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కంటే వెనుకంజలో ఉంటుందని తేలిపోయింది. కనీసం 10 సీట్లు కూడా దక్కించుకోవడం లేదు. ట్రెండ్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 9 స్థానాల వద్ద నిలవనుంది. గుజరాత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, అవి చెల్లా చెదురువు అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఓ ఊరట దక్కనుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 9 స్థానాలు రావడంతో పాటు 13 శాతం వరకు ఓట్ షేర్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించేందుకు రెండు స్థానాలు గెలవడంతో పాటు 6 శాతం ఓట్లు పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పార్టీ ఢిల్లీ, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించింది. ప్రస్తుత గుజరాత్ ఎన్నికల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందనుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదని మొదటి నుండి భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు అనుగుణంగానే అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం దాదాపు శూన్యం.
ప్రస్తుతం దేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP), బహుజన సమాజ్ పార్టీ (BSP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – మార్క్సిస్ట్ (CPM), కాంగ్రెస్ (INC), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), తృణమూల్ కాంగ్రెస్ (TMC), నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. పదేళ్ల క్రితం పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక తెలుగుదేశం వంటి పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నప్పటికీ అధికార గుర్తింపు లేదు. ఏదైనా పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే కనీసం మూడు రాష్ట్రాల నుండి 2 శాతం ఓట్లు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు రావాలి. నాలుగు రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి.