Amith Shah: తెలంగాణ సీఎం కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీలో చేతిలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమర్శించారు. మజ్లస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ జన గర్జన సభలో ప్రసంగించారు. గిరిజన వర్సిటీ కోసం స్థలం ఇవ్వాలని అడిగితే గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ స్థలం ఇవ్వలేదని విమర్శించారు. వర్సిటీ మంజూరు చేశామని.. నిజామాబాద్‌కు పసుపుబోర్డు కూడా రాబోతుందని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీని భారత రాష్ట్రపతిని చేశాం అని గుర్తుచేశారు. రామలయం కడతామని చెప్పిన కాంగ్రెస్ కట్టిందా అని అడిగారు. బీజేపీ మాట అంటే మాటే అని.. అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందన్నారు.
కేటీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యం
కుమ్రం భీమ్ పేరు వినగానే తన రోమాలు నిక్కబోడుచు కుంటాయని అమిత్ షా తెలిపారు. కేసీఆర్ లక్ష్యం ఒక్కటే కేటీఆర్‌ను సీఎం చేయడం అని పేర్కొన్నారు. కూతురు కోసం కూడా పనిచేస్తారని తెలిపారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేదలను మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ..? దళిత బంధు నిజమైన లబ్దిదారులకు దక్కడం లేదు. ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు.
అందులో నంబర్ వన్
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం రజాకార్ల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది బీజేపీ మాత్రమేనని తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కిసాన్ సమ్మాన్ నిధిని దేశంలో ఉన్న ప్రతీ రైతుకు అందజేస్తున్నామని అమిత్ షా వివరించారు. మంచినీటి కోసం నిధులను కేటాయించామని తెలిపారు. మహిళలు, బాలికలపై అత్యాచారాల్లో మాత్రం తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మిగతా అన్నీ రంగాల్లో విఫలమైందని విమర్వలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
కొత్త బట్టలు వేసుకొని వస్తారు
పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఎన్నికలు అంటే చాలు కాంగ్రెస్ నేతలు కొత్త బట్టలు వేసుకొని వస్తారు.. పేదల గురించి ఏమీ చేయరని ఫైరయ్యారు. బీజేపీ అలా కాదని.. భారతపై దాడి చేస్తే ప్రతీ దాడి తప్పదని హెచ్చరించారు. యురి అటాక్ అందుకు ఉదహరించారు.