కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఆదిలాబాద్ జనగర్జన సభలో బండి సంజయ్ రెచ్చిపోయారు. కేసీఆర్‌కు ఏం జరిగిందని, ఎందుకు బయటకు కనిపించడం లేదని, కేటీఆర్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు భద్రత పెంచాలని అన్నారు. అయితే ప్రస్తుతం సంజయ్ వ్యాఖ్యలు కేసీఆర్ గురించి కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
Bandi Sanjay: ఆదిలాబాద్ సభలో కేటీఆర్(KTR)ను ఉద్దేశించి బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. గత మూడు వారాలుగా కేసీఆర్(KCR) ఎక్కడా కనిపించకపోవడం వెనుక రహస్యం ఏంటని, కేటీఆర్‌పై తనకు అనుమానం ఉందని అన్నారు. పార్టీ అన్ని కార్యక్రమాల్లో కేటీఆర్, హారీశ్ రావులు ఇద్దరే చూసుకుంటున్నారని కేసీఆర్ గురించి ఆరా తీశారు. ఈయన మాటలతో ముందు నుంచి వినిపిస్తున్న వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే పార్టీ వ్యవహారాలన్ని కేటీఆర్ చూసుకుంటున్నారని, ఇక కేసీఆర్ కూడా ఈ విషయంలో సైలెంట్‌గా ఉంటున్నారని, అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన గురువు అని, ఆయనను చూసే మాటలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వివరాలను వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం తనకు చాలా బాధను కలిగిస్తోందని, ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు. కేసీఆర్ కనిపించకపోవడం వెనుక కేటీఆర్ పై తనకు అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల కాలంలో తెలంగాణకు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ అప్పుల బాధ పోతుందని అన్నారు. బీజేపీ పాలనలో బీసీలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన బైంసా అల్లర్లను మరో సారి గుర్తు చేశారు. అమాయకుల మీద పీడీ యాక్ట్‌లు పెట్టారని, మహిళలను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆ ఘటనలు ఎవరు మరిచిపోవద్దని అన్నారు. ఇక ఆదిలాబాద్‌లో 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అధికారాన్ని పంచుకోవాలని చూస్తున్నారని వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీని గెలిపించుకోవాలని కోరారు.