ఇప్పుడున్న సీనియర్ హీరోల వారసుల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ విక్టరీ వెంకటేష్ సొంత ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇండస్ట్రీలో కూడా ఎక్కడా వాళ్ల పేర్లు వినిపించవు. ఇదిగో ఇలా పెళ్లి వార్తలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ల గురించి తెలుస్తుంటుంది.
ప్రస్తుతం వెంకటేష్ ‘సైంధవ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. వెంకీ మామ ఇంట్లో పెళ్లి సందడి అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు ఆశ్రిత. కొన్నేళ్ల క్రితమే ఆమెకు పెళ్లి అయింది. ఇక ఇప్పుడు రెండో కూతురు హయవాహిని పెళ్ళికి సిద్ధమైంది.
విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో.. రేపు వెంకీ రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ పెళ్లి ఉంటుందని సమాచారం. దీంతో అతి త్వరలోనే దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది. గతంలో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి జైపూర్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు సినీ,రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.
ఇక వెంకీ కూతుర్ల విషయానికొస్తే.. పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి తరువాత ఒక ఫుడ్ బ్లాగర్‌గా మారింది. హయవాహిని ఒక అథ్లెట్ అని సమాచారం. కానీ మూడో కూతురు పేరు భావన. ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వెంకీ కొడుకు పేరు అర్జున్ దగ్గుబాటి. రానా, అభిరాం తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో వెంకీ కొడుకునే కానున్నాడు.