Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో తాజాగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్ తన 170వ సినిమా వివరాలను ఈ ఏడాది ప్రారంభంలోనే తెలిపారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ చిత్రం ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదని వెల్లడించారు. అయితే రజనీకాంత్ 170వ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నారని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపారు. ’33ఏళ్ల తర్వాత నా మార్గదర్శ, అద్భుతమైన వ్యక్తి అమితాబ్ బచ్చన్‌తో కలిసి వర్క్ చేస్తున్నా. నేను జ్ఞానవేల్ దర్శకత్వంలో రాబోయే లైకా ప్రొడక్షన్స్‌లో “తలైవర్ 170″లో నా గురువు అమితాబ్ బచ్చన్‌తో కలిసి మళ్లీ పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అమితానందంతో నా మనసు నిండిపోయిందని’ రజనీకాంత్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్‌తో దిగిన ఓ ఫోటోని రజనీకాంత్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లెజండరీ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఆనందంగా ఉందని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలోని సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలిపారు. జైలర్ తర్వాత రజనీకాంత్ నటిస్తోన్న చిత్రం ఇదే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా లైకా ప్రొడెక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో పాటు రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1991లో విడుదలైన హమ్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించలేదు.