Balayya-Ravi Teja: ఆ పెద్ద నిర్మాత వల్ల.. బాలయ్య, రవితేజకు ఇబ్బందులు!
నిజమే.. ఈ సారి దసరా వార్ గట్టిగా జరగబోతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. ఈ ముగ్గురు మధ్య ఊరమాస్ పోటీ ఉండబోతోంది. కానీ ఈ ముగ్గురికి పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడు. దీంతో ఓ టాలీవుడ్ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వల్ల బాలయ్య, రవితేజకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు.
పోయిన సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల విషయంలో గోల గోల చేశారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యకు పోటీగా దిల్ రాజు ‘వారసుడు’ సినిమా రిలీజ్ ఉండడంతో.. థియేటర్ల విషయంలో పెద్ద గొడవే జరిగింది. డబ్బింగ్ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారని.. దిల్ రాజు పై కొందరు విరుచు పడ్డారు. కానీ ఫైనల్‌గా చిరు, బాలయ్య సినిమాల తర్వాతే వారసుడు మూవీని థియేటర్లోకి తీసుకొచ్చాడు దిల్ రాజు. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి థియేటర్ల వివాదమే జరిగేలా ఉందంటున్నారు. వచ్చే దసరా సందర్భాంగా.. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బీకె 108 రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
జూన్ 10న ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాకి భగవత్ కేసరి అనే టైటిల్ అనుకున్నట్లు టాక్. ఇక బాలయ్యకు పోటీగా మాస్ మహరాజా రవితేజ రంగంలోకి దిగుతున్నాడు. రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వర రావు’ దసరా రిలీజ్ ప్లానింగ్‌లో ఉన్నారు. వీళ్లతో పాటు బోయపాటి శ్రీను, రామ్ పోతినేని అప్ కమింగ్ సినిమా కూడా థియేటర్లోకి రానుంది. మూడు పెద్ద సినిమాలే కావడంతో థియేటర్ల కొరత తప్పదు. అయితే తెలుగు హీరోలు అడ్జెస్ట్ అయినా.. తమిళ్ హీరో సినిమా విషయంలో థియేటర్ల ఇబ్బందులు తప్పవంటున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘లియో’ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్‌కు చెందిన ఒక పెద్ద నిర్మాత చర్చలు జరుపుతున్నారట. ఆయన ఎవరనేది ఇంకా బయటికి రాలేదు గానీ.. అదిగానీ ఓకే అయితే.. బాలయ్య, రవితేజ సినిమాలకు థియేటర్ల ఇబ్బందులు తప్పవంటున్నారు. మరి దసరా థియేటర్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.