సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు అభిమానులు. ప్రస్తుతం జైలర్ అనే సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా.. షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక ఏడు పదుల వయసులోను యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రజనీ. ఈ క్రమంలో జైలర్ సెట్స్ పై ఉండగానే.. మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు.
భారీ ప్రాజెక్ట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌లా మారిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అందుకు రంగం సిద్దం చేస్తోంది. రీసెంట్గా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్:1 మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది లైకా. ప్రస్తుతం మణిరత్నంతో ‘పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్’ మరియు శంకర్‌తో ‘ఇండియన్ 2’ చిత్రాలను నిర్మిస్తోంది. ఇక ఇప్పుడు రజనీకాంత్‌తో రెండు సినిమాలను లైన్లో పెట్టారు. గతంలో లైకా బ్యానర్లో ‘రోబో 2.0’.. ‘దర్బార్’ సినిమాలు చేశారు రజనీ.
దాంతో ఇప్పుడు సూపర్ స్టార్‌తో మరో రెండు సినిమాలు చేయబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ అధినేతలుప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 5న చెన్నైలో గ్రాండ్‌గా జరగనున్నాయి. అయితే ఈ సినిమాలకు దర్శకులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దర్శకులతో పాటు మిగతా వివరాలు కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.