ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాతో ఇండియన్ 2ని కూడా తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లాడు శంకర్. అందుకే ఈ స్టార్ దర్శకుడిపై కాస్త అసహనంగా ఉన్నారు మెగాభిమానులు.
కానీ శంకర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు చరణ్ మరియు కియారా అద్వానీ పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ ఒక్క న్యూజిలాండ్ షెడ్యూల్ కోసమే దాదాపు 15 కోట్లు ఖర్చు చేస్తున్నారట.
దాంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకు సంబంధించిన చరణ్ తాజా లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీంతో సరదాగా చిట్ చాట్ చేస్తున్న ఓ స్టిల్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఇందులో ఆలిమ్ హకీమ్ పని తీరు గురించి పేర్కొన్న చరణ్.. బోస్కో మార్టిస్ తన సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేస్తునట్లు హింట్ ఇచ్చేశాడు.
ఇక ఈ ఫొటోలో చరణ్ కూల్‌గా కనిపిస్తున్నాడు.. అలాగే చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. ఆలిమ్ సెట్ చేసిన లాంగ్ హెయిర్ స్టైల్ కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.